ETV Bharat / state

తేనెపూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు: కేసీఆర్​

author img

By

Published : Sep 19, 2020, 8:45 PM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని తెరాస నిర్ణయించింది. తేనెపూసిన కత్తిలా ఉన్న ఈ బిల్లు రైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులాంటిదని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. బిల్లులోని లోపాలను వివరిస్తూ తెరాస పార్లమెంటరీ నేతకు సీఎం మార్గనిర్దేశం చేశారు. రాజ్యసభలో గట్టిగా గళమెత్తాలని సూచించారు. కార్పొరేట్‌కు మేలు చేకూర్చేలా రూపొందించిన బిల్లును వ్యతిరేకిస్తామని తెరాస పార్లమెంటరీ నేతలు వెల్లడించారు.

MPs should oppose the agriculture bill in the Rajya Sabha: cm kcr
తేనెపూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు: కేసీఆర్​

కేంద్రం తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లు రైతులకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని తెరాస పార్లమెంటరీ నేత కేశవరావును ఆదేశించారు. రైతులను దెబ్బ తీసి కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉన్న బిల్లుపై గళమెత్తాలన్నారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించారు. రైతులు పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం పైకి చెబుతున్నా.. వాస్తవానికి వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకు కొనుగోలు చేసేలా బిల్లు ఉందన్నారు. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించేందుకు, ప్రైవేట్ వ్యాపారులకు తలుపులు బార్లా తెరిచేందుకు ఉపయోగపడే బిల్లు అని కేసీఆర్​ వ్యాఖ్యానించారు. రైతులు తమకున్న కొద్దిపాటి సరకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకి తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తేనె పూసిన కత్తిలాంటి చట్టమని ఆందోళన వెలిబుచ్చిన సీఎం.. కచ్చితంగా బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించి తీరాలని తెరాస పార్లమెంటరీ నేతకు దిశానిర్దేశం చేశారు.

సుంకం తగ్గించి మొక్కజొన్న దిగుమతి ఎందుకు?

మొక్కజొన్న దిగుమతిపై 50 శాతం సుంకం అమల్లో ఉండగా.. 15 శాతానికి తగ్గించి కోటి టన్నులు దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్న సీఎం... ఇప్పటికే 70 నుంచి 75 లక్షల టన్నుల మక్కలు కొనుగోలు చేశారని తెలిపారు. 35 శాతం సుంకం ఎవరి ప్రయోజనం ఆశించి తగ్గించారని ప్రశ్నించిన కేసీఆర్‌... దేశంలో పుష్కలంగా మొక్కజొన్న పండుతుండగా సుంకం తగ్గించి మరీ దిగుమతి చేసుకుంటే దేశ రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తెచ్చేలా ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసేలా రూపొందించిన బిల్లుపై రాజ్యసభలో గట్టిగా గళమెత్తి.. వ్యతిరేకంగా ఓటు వేయాలని తెరాస ఎంపీలను కేసీఆర్​ ఆదేశించారు.

మంత్రి పదవికి హర్‌సిమ్రత్‌కౌర్‌ రాజీనామా

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులు కేంద్రం లాక్కోవాలని చూస్తొందన్నారు. కనీస మద్దతు ధరకు బదులు నాన్‌ మార్కెట్ జోన్ ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతు, వ్యవసాయ బిల్లులకు బీజేడీ, అన్నాడీఎంకే, వైకాపా, తెదేపా మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌, తెరాస, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్‌, ఏస్పీ, బీఏస్పీ, ఆప్‌ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీయే భాగస్వామి అకాళీదళ్‌ నుంచి మంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌కౌర్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇదీ చూడండి: ఆ బిల్లులకు మేము వ్యతిరేకం: కే కేశవరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.