ETV Bharat / state

బుల్లెట్ నర్సన్న కన్నుమూత.. శోకసంద్రంలో తెరాస శ్రేణులు

author img

By

Published : Oct 22, 2020, 1:33 AM IST

Updated : Oct 22, 2020, 3:06 AM IST

కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు
కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు

తొలితరం తెలంగాణ ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. తెలంగాణే ఊపిరిగా జీవన ప్రస్థానం సాగించిన తెలంగాణ ముద్దుబిడ్డ, కార్మికనేత నర్సన్న తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా అపోలో వైద్యులు ప్రకటించారు.

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా అపోలో వైద్యులు ప్రకటించారు. కరోనాతో నాయిని ఆసుపత్రిలో చేరారాని.. తీవ్రమైన లంగ్​ ఇన్​ఫెక్షన్ కావడంతో మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చేరారు. అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారని అనుకున్నారు. గతవారం ఆయనకు ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో ఈనెల 13న హుటాహుటిన జూబ్లీహిల్స్​ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్‌ రవి ఆండ్రూస్, మరో డాక్టర్‌ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో వెంటిలేటర్​పై చికిత్స అందించారు. చికిత్సకు నాయిని శరీరం సహకరించకపోవడం వల్ల డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.

ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం కేసీఆర్

నాయిని పరిస్థితి రోజురోజుకు అంతకంతకు విషమించింది. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. బుధవారం.. స్వయంగా ముఖ్యమంత్రి అపోలో ఆసుపత్రికి వెళ్లారు. నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నాయిని ఆరోగ్యం మరింతగా క్షీణించడం వల్ల.. తుదిశ్వాస విడిచారు.

నాయినికి కరోనా ఎలా సోకింది..?

లాక్‌డౌన్‌తోపాటు కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని అభిమానులు అందించిన కేక్‌ను తిన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Last Updated :Oct 22, 2020, 3:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.