ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద సీసీ కెమెరాల టెండరింగ్‌లో మాయజాలం

author img

By

Published : Oct 10, 2020, 6:46 AM IST

ghmc traffic signals tenders issues controversia

జీహెచ్​ఎంసీ పరిధిలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద సీసీటీవీ కెమెరాల టెండర్‌ ప్రక్రియలో మాయజాలం జరుగుతోంది. సింగిల్‌ టెండర్‌ దాఖలు చేసిన ఓ సంస్థపై నగర పాలక సంస్థ అధికారులు ఎక్కడ లేని ప్రేమ చూపడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం సింగిల్‌ టెండర్‌ వచ్చినా... అంచనా కంటే అధికంగా టెండర్‌ వేస్తే.. ఆ టెండరును రద్దు చేయాలి. కానీ ఓ సంస్థకే కాంట్రాక్టును కట్టబెట్టాలని అధికారులు, పురపాలక శాఖ ఉన్నతాధికారికి లేఖ రాయడం వివాదస్పదంగా మారింది. ఆ లేఖ ఈనాడు, ఈటీవీ భారత్​ సంపాదించడంతో అసలు విషయం బయటపడింది.

ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తమకు నచ్చిన సంస్థలకే టెండ్లర్లు దక్కాలని తాపత్రయ పడుతున్నారు. మహానగరంలో కొత్తగా 155 కూడళ్ల వద్ద, 98 పాదచారులు దాటే ప్రాంతాల్లో పెలికాన్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేసేందుకు నగర పాలకసంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. టెండరు ధర రూ.59 కోట్ల 86 లక్షలుగా ఖరారు చేశారు. అత్యాధునిక సమాచార పరిజ్ఞానం, ఏటా కనీసం రూ.20 కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థలు బిడ్​లలో పాల్గొనాలని ప్రకటన విడుదల చేశారు.

అంచనా కంటే 17.60 శాతం అధికంగా

హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలు దిల్లీలో ఉన్న మరో సంస్థ ప్రీ బిడ్‌లో పాల్గొన్నాయి. ఒక హైదరాబాద్‌ సంస్థ ప్రీబిడ్‌లో అర్హత పొందలేకపోయింది. మరో హైదరాబాద్‌ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.20 కోట్ల కంటే తక్కువగా ఉండడంతో ఆ టెండర్‌ను తిరస్కరించారు. దీంతో టెండర్లలో ఒక్కటే సంస్థ పాల్గొన్నట్టు అయింది. అయితే ఆ సంస్థ అంచనా కంటే 17.60 శాతం అధికంగా అంటే రూ.59.86 కోట్లతో చేయాల్సిన పనులు రూ.72.26 కోట్లతో చేస్తామని పేర్కొంది.

నిబంధనల ప్రకారం

ఇంజినీరింగ్‌ నిబంధనల ప్రకారం అంచనాకు 5 శాతం కంటే అధికంగా కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేస్తే ఆ టెండర్‌ రద్దవుతుంది. కానీ బల్దియా అధికారులు టెండరు దాఖలు చేసిన దిల్లీ సంస్థతో చర్చించి... అంచనా మొత్తం తగ్గించుకోండి, మీకే పని ఇస్తామని కోరినట్టు తెలుస్తోంది.

వివాస్పదంగా మారిన లేఖ

అంచనాకు 4.37 శాతం అధికంగా ఉంటే రూ.62 కోట్ల 67 లక్షలకు చేస్తామంటూ సంస్థ ముందుకు వచ్చినట్టు నగర పాలక సంస్థ అధికారులు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. దిల్లీ సంస్థ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని ఆ సంస్థకే కాంట్రాక్టు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది పెద్దలు జోక్యం చేసుకున్నట్టు సమాచారం.

ఇవీ చూడండి: ప్రక్షాళనతో వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం సమకూరేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.