ETV Bharat / state

వివేకా హత్యకేసు... మరో మలుపు..!

author img

By

Published : Sep 28, 2019, 6:11 AM IST

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. 6నెలలు దాటినా హంతకులు ఎవరనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు. కేసులో ప్రముఖ వ్యక్తులు ఉన్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో... పోలీసులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. దర్యాప్తు చేస్తున్న ఇద్దరు జిల్లా ఎస్పీలు 5నెలల వ్యవధిలో బదిలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు సీబీసీఐడీకి అప్పగిస్తారనే ప్రచారం పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాకు వస్తున్న కొత్త ఎస్పీ ఏమేరకు కేసు బయట పెడతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

వివేకా హత్యకేసు

వివేకా హత్యకేసు

కడప జిల్లా పులివెందుల పట్టణానికి చెందిన మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య జరిగి 6నెలలు దాటినా ఇంకా కేసు కొలిక్కి రాలేదు. మార్చి 15న వివేకానందరెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రముఖ వ్యక్తుల పాత్ర ఉందనే అనుమానంతో సిట్ దర్యాప్తు చేపట్టినా... హంతకులు ఎవరనేది తేల్చలేక పోతున్నారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సొంత బాబాయి కావడం కారణంగా పోలీసులు కేసు వివరాలు బయట పెట్టడానికి తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల ముందు కేసు దర్యాప్తు చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మపై బదిలీ వేటుపడింది. తర్వాత సిట్​లో కీలకంగా వ్యవహరించిన అభిషేక్ మొహంతిని మరోసారి జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈయన కేసును దాదాపు కొలిక్కి తెచ్చారు. డీజీపీ గౌతమ్​ సవాంగ్... 23 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వివేకా హత్య కేసులో అనుమానితులు ఎవరనేది... ఎస్పీ అభిషేక్ మొహంతి ఓ నివేదికను డీజీపీకి అందజేసినట్లు సమాచారం.

ఈ నెల 4న కడపకు వచ్చిన డీజీపీ గౌతమ్​ సవాంగ్.. వివేకా హత్య కేసుపై సమీక్ష నిర్వహించారు. అప్పటి నుంచి కేసు మందగించింది. అప్పటివరకు ఆచీతూచీ దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు విచారణ చేయలేదని తెలుస్తోంది. అనుమానితులు ఎవ్వరినీ విచారణకు పిలవలేదు. ఈనెల 1న వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కసనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కేసు దాదాపు మందగించింది. సిట్ అధికారుల బాధ్యత కూడా పూర్తి కావడం కారణంగా చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన అధికారులు వారి విధులకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

వివేకా కేసు తలనొప్పిగా మారడం పట్ల జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి కూడా బదిలీ కోరుకున్నారు. వారం రోజుల నుంచి ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో కడప పోలీస్ బాస్​గా... తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ నియమితులయ్యారు. ఈయన గతంలో పులివెందుల ఏఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం కొత్త ఎస్పీ రాగానే వివేకా కేసు సవాల్​గా మారే అవకాశముంది. కాగా వివేకా కేసు వివరాలు వెల్లడిస్తే... ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇదీ చదవండీ...గజ్జెల చప్పుడుతో 'గౌరి' స్వాగతం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.