ETV Bharat / city

'అమరావతి తప్పు అని ప్రజలు అంటే... క్షమాపణ చెప్తా'

author img

By

Published : Dec 5, 2019, 5:15 PM IST

Updated : Dec 5, 2019, 6:25 PM IST

అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే వారికి క్షమాపణ చెప్పటానికి తాను సిద్ధంగా ఉన్నానని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా అమరావతి వద్దు అంటే తామూ అందుకనుగుణంగానే వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. అమరావతిలో భవనాలు నిర్మాణాల వాస్తవ స్థితిగతులపై వీడియో, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన చంద్రబాబు... అనుకున్న ప్రకారం అమరావతి ముందుకెళ్తే ప్రపంచ రాజధానుల్లో ఒకటిగా నిలిచేదని వివరించారు.

చంద్రబాబు
చంద్రబాబు

రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు
అమరావతి భావితరాల భవిష్యత్తు అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. దానికి అన్యాయం జరుగుతుంటే కలసిగట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రజారాజధాని పేరిట విజయవాడ ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాజధాని నిర్మాణం ఆగిపోవటం వల్ల యువత తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలంతా చర్చించాలని చంద్రబాబు కోరారు.

అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే వారికి క్షమాపణ చెప్పటానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా అమరావతి వద్దు అంటే తామూ అందుకనుగుణంగానే వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఆసుపత్రులు లేవు కాబట్టే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశారని ఆయన విమర్శించారు.

అప్పుడు స్వాగతించారు... ఇప్పుడు నిలిపివేశారు
తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. భవనాలన్నీ గ్రాఫిక్స్ కాదు నేలపై నిజాలు పేరిట ఈ వీడియో ప్రదర్శించారు. ఆరునెలల్లో పూర్తయ్యే నిర్మాణాలను కూడా నిలిపివేశారని చంద్రబాబు ఆక్షేపించారు. నిర్మాణాలు పూర్తిచేస్తే ఈ పాటికి ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు అమరావతిలోనే ఉండేవాళ్లని ఆయన అన్నారు. రాజధానిలో 30 వేల ఎకరాల్లో ఉండాలని నాడు జగన్ చెప్పారని గుర్తుచేశారు. విజయవాడలో రాజధాని నిర్ణయాన్ని జగన్ కూడా ఆహ్వానించారని చెప్పారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని గ్రాఫిక్స్ అని ఎగతాళి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ధీటైన నగరం లేకుంటే ఆదాయం ఎలా వస్తుంది..?
అమరావతి భవనాల వాస్తవ స్థితిగతులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ నగరం కాబట్టే హైదరాబాద్ కంటే ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయగలిగేవాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి పనులు ముమ్మరంగా జరిగినప్పుడు 50వేల మంది పనిచేశారని గుర్తుచేశారు. నగరం ఉంటేనే అన్ని రకాల ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. ప్రతి గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బులు కావాలన్న చంద్రబాబు... సంపద సృష్టించలేకపోతే ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. అమరావతి సంపద సృష్టించే ప్రాజెక్టని చంద్రబాబు ఉద్ఘాటించారు.

వివిధ పార్టీల మద్దతు...
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి 17 పార్టీలను తెదేపా ఆహ్వానించింది. సీపీఐ నుంచి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి బొలిశెట్టి సత్యనారాయణ హాజరయ్యారు. కాంగ్రెస్, భాజపా, సీపీఎం సమావేశానికి మద్దతు తెలిపాయి. చంద్రబాబు, ఇతర పార్టీల నేతలు సైన్ బోర్డుపై సంతకం చేశారు. అమరావతిలో నిర్మాణాలపై ఏర్పాటు చేసిన ఫొటోఫ్లెక్స్​లను నేతలు పరిశీలించారు. అమరావతి పోస్టర్​పై సేవ్ అమరావతి అని రాసి చంద్రబాబు సంతకం పెట్టారు. సమావేశానికి తెదేపా ముఖ్యనేతలతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు.

ఇదీ చదవండి

'ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా'

Last Updated : Dec 5, 2019, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.