ETV Bharat / city

22వ రోజుకు అమరావతి రైతు ఉద్యమం !

author img

By

Published : Jan 8, 2020, 5:50 AM IST

Updated : Jan 8, 2020, 4:58 PM IST

రాజధాని కోసం రైతు ఉద్యమం మహోగ్రరూపం దాలుస్తోంది. మూడు వారాలు దాటి నాలుగో వారంలోకి ఆందోళనలు, నిరసనలు ప్రవేశించినా... ఎక్కడా జోరు తగ్గడం లేదు. రెట్టించిన  పట్టుదలతో మహిళలు, చిన్నారులు, వృద్థులు... అమరావతి కోసం మేము సైతం  అంటూ... ఉద్యమాన్ని అంతకంతకు ఉద్ధృతం చేస్తున్నారు.

22వ రోజుకు అమరావతి రైతు ఉద్యమం !
22వ రోజుకు అమరావతి రైతు ఉద్యమం !

22వ రోజుకు అమరావతి రైతు ఉద్యమం !

రాజధాని ప్రాంత ప్రజలు, రైతుల పోరు.. నేడు 22వ రోజుకు చేరింది. మంగళవారం నిర్వహించిన విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి దిగ్బంధనాన్ని విజయవంతం చేసినట్లు ఐకాస నేతలు ప్రకటించారు. గుంటూరులో మహిళలు స్వచ్ఛందంగా చేపట్టిన... భారీ ర్యాలీ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. తెలుగుదేశం నేతల అరెస్టులు, పోలీసు స్టేషన్‌లకు తరలింపు పరిణామాలతో ఉద్యమం మరింత రాజుకుంటోంది. చినకాకాని జాతీయ రహదారిపై ధర్నా చేసిన రైతులని అరెస్ట్ చేసినందుకు నిరసనగా వివిధ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. రైతుల అరెస్టులకి నిరసనగా యువకులు బైక్ ర్యాలీలు, మహిళల కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అమరావతి రాజధానిగా ఉండాలని నినాదాలు చేశారు.
ఆందోళనల సమయంలో పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కనికరం లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ఇద్దరు బలి

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో గుండెపోటుతో మరో వ్యక్తి మరణించారు. 10 రోజులుగా అమరావతి నిరసనల్లో పాల్గొన్న లక్ష్మయ్య అనే వ్యక్తి రాజధాని తరలిపోతుందనే ఆందోళనతో చనిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి చెందిన కర్నాటి ఎర్రమ్మ కూడా గుండెపోటుతో కన్నుమూశారు. రాజధాని తరలింపు వార్తలతో ఆవేదన చెంది ఆమె చనిపోయినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. ఎర్రమ్మకు రెండు ఎకరాలు పొలం ఉండగా...ఆమె తన ఇద్దరు కుమార్తెలకు చెరో ఎకరం రాసిచ్చారు. వారిద్దరూ రాజధాని కోసం ఆ భూమిని ఇచ్చేశారు.

కొనసాగనున్న నిరసనలు
నేడు మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహించనుండగా...వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పర్యటించి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెం వద్ద జరగనున్న పూజల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిరసన తెలపనున్నారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతోపాటు.... కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళనలు చేపట్టనున్నాయి.

ఇదీచదవండి

'విశాఖనే రాజధానిగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే..!'

sample description
Last Updated :Jan 8, 2020, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.