కూతవేటు దూరంలోనే కృష్ణమ్మ - తాగునీటికి కటకటలాడుతున్న పల్లెలు - Drinking Water Problem

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 2:27 PM IST

drinking_water_problem

People Suffering Due to Lack of Drinking Water: తాగునీటి కష్టాలు రాష్ట్రమంతటా మార్చి చివరి వారం నుంచి మెుదలైతే పల్నాడు జిల్లాలో మాత్రం మూడు నెలల ముందే మెుదలయ్యాయి. మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లోని మారుమూల తండాల ప్రజలు రెండు, మూడు నెలల కిందట నుంచే తాగునీటి సమస్యతో సావాసం చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది.

కూతవేటు దూరంలోనే కృష్ణమ్మ - తాగునీటికి కటకటలాడుతున్న పల్లెలు

People Suffering Due to Lack of Drinking Water: పల్నాడు జిల్లాలు అన్ని ఇప్పుడు దాహం దాహం అంటున్నాయి. తాగునీరు లేక పల్లెలన్నీ కటకటలాడుతున్నాయి. కృష్ణమ్మ కూతవేటు దూరంలో ఉన్నా నాగార్జున సాగర్ కుడి కాలువ అత్యంత సమీపంలోనే ఉన్నా తాగేందుకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి. పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దప్పిక తీరేలా కడుపారా మంచి నీరు తాగలేని దయనీయ పరిస్థితి.

వెల్దుర్తి, బొల్లాపల్లి మండలాల్లోని ప్రజల తాగునీరు, కనీస అవసరాలకు బోర్లే ఆధారం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా రెండు, మూడు నెలలుగా బోర్ల నుంచి నీరు రావడం లేదు. దీంతో తాగునీరు లభించే మరో మార్గం లేక గిరిజన తండా వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల వేళ మాత్రమే ఓటర్లుగా గుర్తించి హామీలు గుప్పించే నేతలు తర్వాత మా బాధలు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నీటి కష్టాలు తీర్చండి మహా ప్రభో అని వేడుకుంటున్నారు. మరి, పల్నాడు జిల్లా వాసులకు ఏంటీ పరిస్థితి? కృష్ణమ్మ నీరు తాగే భాగ్యం వారికి లేదా.

నిధులు లేక మరమ్మతులు చేయక - వందల గ్రామాలకు అందని తాగునీరు - anantapur district water crisis

మరమ్మతులకు నోచుకోని బోర్లు: తాగునీటి కష్టాలు రాష్ట్రమంతటా మార్చి చివరి వారం నుంచి మెుదలైతే పల్నాడు జిల్లాలో మాత్రం తాగునీటి ఇబ్బందులు మూడు నెలల ముందే మెుదలయ్యాయి. మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లోని మారుమూల తండాల ప్రజలు రెండు, మూడు నెలల కిందట నుంచే తాగునీటి సమస్యతో సావాసం చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడం, మరోవైపు నీటి పథకాల నిర్వహణలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పల్లె వాసులు నీటి కోసం నానా ఆగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం బోర్లుకు కనీసం మరమ్మతులు చేయకపోవడంతో జనం బిందెలతో వ్యవసాయ బోర్లు, నీటి చెలమల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాగునీటి కోసం రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

వందలాది కుటుంబాలకు ఒక్క బోరే ఆధారం: మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తిలో గుక్కెడు నీరు దొరకని దుర్భర పరిస్థితి. కళ్ల ముందు కృష్ణా జలాలు కనిపిస్తున్నా చుక్కనీరు వినియోగించుకోలేని దుస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. అరకొరగా వస్తున్న బోర్ల నుంచి పల్లె వాసులు నీటిని పట్టుకుని దాహం తీర్చుకుంటున్నారు. వెల్దుర్తి మండలంలోని మండాది, వెల్దుర్తి, శిరిగిరిపాడు, మిట్టమీదపల్లె, రచ్చమల్లపాడు, పిచ్చయ్యబావితండా, వజ్రాలపాడుతండా, సేవానాయక్‌తండా, లోయపల్లి, గ్రామాలలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. సేవా నాయక్ తండాలో బోర్ల నుంచి నీరు రావడం లేదని అధికారులు కొత్తగా రెండు బోర్లు వేశారు. వెయ్యి అడుగులు పైనే వేసినా చుక్క నీరు రాలేదు. దీంతో తండాలోని వందలాది కుటుంబాలకు ఒకే ఒక్క బోరు ఆధారంగా మారింది. చేసేది లేక పగలు, రాత్రి బోర్ వద్దే పడిగాపులు కాస్తూ వచ్చే చిన్నపాటి సన్నని ధారనే తండా వాసులు గంటల సమయం వెచ్చించి పట్టుకుంటున్నారు. తాగునీటి కోసం కూలీ పనులకు సైతం వెళ్లకుండా బోరు దగ్గరే జాగారం చేస్తున్నారు.

కిడ్నీ వ్యాధి కబళిస్తున్నా వైసీపీ నేతలకు కనబడదా!- గిరిజన ఆవాసాలకు నిలిచిన తాగునీటి సరఫరా - Kidney Patients Problems in NTR

నీరు లేక భారమవుతున్న పశువులు: వెల్దుర్తి మండలంలోని వజ్రాలపాడు తండా, మిట్టమీదపల్లె వాసులు సైతం తాగునీటి కోసం కటకటలాడుతున్నారు. ఈ తండాల్లో తాగునీటి సరఫరా అనేది లేదు. గ్రామంలో ఉన్న బోర్ల నుంచి నీరు వస్తేనే వారి గొంతు తడుస్తోంది. లేదంటే దాహార్తితో సావాసం చేయాల్సిందే. మిట్టమీద పల్లె తండా వాసులకు నీరు అందించేందుకు గ్రామంలో ఉన్న బావి వద్దనే ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించారు. వ్యవసాయ భూమిలో ఉన్న ఒకే ఒక్క బోర్ నుంచి వచ్చే నీటితో ట్యాంక్, బావి నింపితే, వాటిని గ్రామస్థులు పట్టుకునేవారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి నీరు పట్టుకోలేక స్థానికులంతా బావిలోకి పైపులు వేసి, మోటర్లతో ఇళ్లలోని డ్రమ్ములు, బిందెలు నింపుకునేవారు. కానీ గత రెండు నెలలుగా బోర్ల నుంచి నీరు సరిగ్గా రాకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడిని గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. తండాలోని వారంతా బావి చెంతకు చేరి, అప్పుడప్పుడు వచ్చే బోర్ నీటి కోసం పోటీ పడుతున్నారు. సమయపాలన లేకుండా వచ్చే కొద్దిపాటి నీటి కోసం పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నారు. కేవలం నీరు లేని కారణంగా ప్రేమగా పెంచుకున్న పశువుల్ని సైతం అమ్ముకుంటున్నామని వాపోతున్నారు.

వ్యవసాయ బోర్లూ ఖాళీ: బొల్లాపల్లి మండలంలోని అనేక గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. రేమిడిచర్ల, గండిగనుముల, దోమల గుండం, గుట్టపల్లి, రావులాపురం, బోడిపాలెం తండా వాసులు వేసవికి రెండు, మూడు నెలల ముందు నుంచే తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక, భూగర్భ జలాలు పూర్తిగా నిండుకోవడంతో బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లోని బోర్లు ఎండిపోయినప్పుడు, కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకోవడం ఇక్కడి ప్రజలకు అలవాటుగా మారింది. అయితే ఇప్పుడా వ్యవసాయ బోర్ల నుంచి సైతం నీరు రాకపోవడంతో సమస్య తారాస్థాయికి చేరింది. చిన్నారులు, వృద్ధులకు తాగునీరు లేక దాహంతో అల్లాడిపోతున్నారు.

డయేరియాతో చస్తున్నా అధికారుల కళ్లకు కనబడదా! - Diarrhoea Problems in Guntur

తాగునీటి కోసం ఉక్కిరిబిక్కిరి: రేమిడిచర్ల పరిధిలోని పలు తండాల ప్రజలు తాగేందుకు నీరు లభించక, దాహం తీరే దారి లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సాధారణంగా రేమిడిచర్ల చెరువు నుంచి నీటిని చెంచు కాలనీలోని ఓవర్ హెడ్ ట్యాంక్‌లో నింపి, నీటి సరఫరా చేసేవారు. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువు పూర్తిగా ఎండిపోయింది. దీంతో తాగునీరు సరఫరా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాల్లో బోర్లు పనిచేయకపోతే వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండి సన్నని ధార నుంచి బిందెలు, వాటర్ క్యాన్లు నింపుకునేవారు. ఆ నీటినే ఎంతో జాగ్రత్తగా వాడుకునేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయ బోర్ల నుంచి సైతం నీరు నిలిచిపోవడంతో తండా వాసులు తాగునీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నామమాత్రంగా నీటి ట్యాంకులు: వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, అధికారులు నామమాత్రంగా పంపుతున్న నీటి ట్యాంకులు కొంతమేరకు వారి దాహార్తిని తీరుస్తున్నా అసలు సమస్య మాత్రం పల్లెవాసుల్ని వేధిస్తూనే ఉంది. పల్నాడు ప్రాంతంలోని నీటి ఎద్దడి బారిన పడుతున్న గ్రామాలకు తాగు నీరు లభించాలంటే వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేయడం ఒక్కటే మార్గమని గిరిజన తండా వాసులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జలాలతో తమ దాహార్తి తీరే రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్లు వారు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.