గేట్ ఆలిండియా స్థాయిలో మెరిసిన గుంటూరు యువకుడు - పక్కా ప్రణాళికతో పదో ర్యాంక్ కైవసం - 10th Ranker in GATE All India

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 2:01 PM IST

10th_Ranker_in_GATE_All_India

10th Ranker in GATE All India: చదువుల్లో ప్రతిభ చాటి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం పొందాడు ఆ యువకుడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇంటికి చేరాడు. ఐనా అవకాశం చేజారిందని నిరుత్సాహపడలేదు. గేట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలని నిశ్చయించుకుని పక్కా ప్రణాళికతో శ్రమించాడు. ప్రతిఫలంగా ఇటీవలి ఫలితాల్లో ఏకంగా ఆలిండియా స్థాయిలో పదో ర్యాంకు కైవసం చేసుకున్నాడు.

గేట్ ఆలిండియా స్థాయిలో మెరిసిన గుంటూరు యువకుడు- పక్కా ప్రణాళికతో పదో ర్యాంక్ కైవసం

10th Ranker in GATE All India: దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు అనగానే ఐఐటీ బొంబయి, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ దిల్లీ, ఐఐటీ గువాహటి, ఐఐటీ రూర్కీలు గుర్తుకు రావడం సహజం. వీటితో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే 'గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ "గేట్ " పరీక్షే ఆధారం.

ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తాయి. దేశవ్యాప్తంగా తీవ్ర పోటీ ఉన్న ఈ గేట్ 2024 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపాడు. గుంటూరు జిల్లా కటేవరం గ్రామవాసి యర్రు లక్ష్మీసాయికృష్ణ. మార్చి 16న విడుదలైన గేట్ ఫలితాల్లో వెయ్యికి 970 మార్కులతో పదో ర్యాంకు కైవసం చేసుకున్నాడు.

ఐఐఎస్‌సీ బెంగళూరు ఆధ్వర్వంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశంలోని 200 నగరాల్లో గేట్ 2024 పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు సాయికృష్ణ గతేడాది జూలై నుంచి సన్నద్ధమయ్యాడు. పాఠశాల విద్యను తెనాలిలో పూర్తి చేసిన సాయికృష్ణ ఇంటర్​ను విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నాడు. కాకినాడ జేఎన్టీయూలో బీటెక్​లో చేరిన సాయికృష్ణ మూడేళ్లు కాకినాడలో, ఒక ఏడాది జర్మనీలోనూ చదివి ఇంజినీరింగ్​లో ఉత్తీర్ణత సాధించాడు.

ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు- గవర్నర్‌ చేతుల మీదుగా బంగారు పతకాలు

బీటెక్ మూడో ఏడాదిలో ఉన్నప్పుడే 2022లో గేట్ రాసి ఆ పరీక్షలో ఎలాంటి శిక్షణ లేకుండానే 1,250 ర్యాంకును సాధించాడు. ఈ ర్యాంకు సాయికృష్ణలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. శిక్షణ తీసుకుని ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే ఉత్తమ ర్యాంకు సాధించగలననే నమ్మకాన్ని అందించింది. కాకినాడ జేఎన్టీయూలో మూడేళ్లు కోర్సు పూర్తైన తరువాత నాలుగో ఏడాది జర్మనీకి వెళ్లిన సాయికృష్ణను ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి.

అక్కడి వాతావరణం కారణంగా తరుచూ అనారోగ్యం బారిన పడేవాడు. ఐనా ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఉత్తమ ప్రతిభ చూపి మంచి మార్కులతో బీటెక్ పట్టా అందుకున్నాడు. అక్కడే ఎంటెక్ చదివే చక్కటి అవకాశం వచ్చినా మాతృదేశంలోనే పీజీ చేయాలనే లక్ష్యంతో తిరిగి వచ్చాడు. గతేడాది జూలై నుంచి గ్రేట్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. హైదరాబాద్​లోని ఓ విద్యా సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్​లో స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటూ సాధన కొనసాగించాడు.

గత 30, 35 ఏళ్ల నాటి పాత పరీక్ష పత్రాలను చేస్తూ తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాడు. గేట్ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతారు. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చదివిన ఉత్తమ విద్యార్థులంతా పోటీ పడతారు. ఈ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేటప్పుడు సహజంగానే ఈ పోటీలో విజేతగా నిలవగలమా అనే సందేహం వచ్చి తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భాలు ఉన్నాయని అంటున్నాడు సాయికృష్ణ.

పెన్సిల్​ కొనపై 'బాల రాముడు'- 93 లింకులతో గొలుసు- గిన్నిస్​లోనూ చోటు

అలాంటి సమయంలో మానసిక ధైర్యం కోల్పోక చిన్నపాటి విరామం తీసుకుని, కుటుంబసభ్యులు, మిత్రులతో కాలక్షేపం చేసేవాడినని తెలిపాడు. శిక్షణ పూర్తైన తరువాత ఇంట్లోనే ఉండి చదువుకోవడం వల్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వెన్నంటి ప్రోత్సాహం అందించారన్నాడు. చదువునేందుకు చక్కటి వాతావరణం, ఆరోగ్యాన్ని కాపాడే పౌష్టికాహారం కూడా తన ర్యాంకు సాధనలో కీలకపాత్ర పోషించాయని పేర్కొన్నాడు.

చిన్నతనం నుంచి బాగా చదివే సాయికృష్ణ మంచి ర్యాంకు సాధిస్తాడని అనుకున్నాం కానీ టాప్ టెన్​లో నిలుస్తాడని మాత్రం అనుకోలేదని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం మెచ్చే విద్యావంతుల్ని, ఇంజినీర్లను తీర్చిదిద్దే ఐఐటీ బొంబయి, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఏంటెక్ పూర్తి చేసి, దేశాభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించడమే తన లక్ష్యమంటున్నాడు సాయికృష్ణ. తన తండ్రి చేసే సేవా కార్యక్రమాలకు చేయూత ఇస్తూనే, తన వంతుగా సామాజిక సేవ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

"గతేడాది జూలైలో హైదరాబాద్ కోచింగ్ సెంటర్​లో గేట్ శిక్షణ ప్రారంభించాను. అక్కడ శిక్షణ తీసుకున్న అనంతరం డిసెంబర్​లో స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటూ సాధన కొనసాగించాను. నా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వెన్నంటే ఉండి ప్రోత్సాహం అందించారు. ఈ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేటప్పుడు లక్షలాది మందిలో విజేతగా నిలవగలమా అనే సందేహాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి సమయంలో మానసిక ధైర్యం కోల్పోకుండా కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి కాసేపు గడిపేవాడిని. ఇలా పక్కా ప్రణాళికతో శ్రమించాను. ఫలితంగా గేట్ ఆలిండియా స్థాయిలో పదో ర్యాంకు సాధించాను." - యర్రు లక్ష్మీసాయికృష్ణ, గేట్ పదో ర్యాంకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.