ఇది సన్​రైజర్స్​ జట్టేనా?- ఆ సెంటిమెంట్ వర్కౌటైతే కప్పు పక్కా హైదరాబాద్​దే! - Sunrisers Hyderabad IPL

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 11:47 AM IST

Updated : Mar 28, 2024, 12:13 PM IST

sunrisers hyderabad iPl

Sunrisers Hyderabad IPL: ఐపీఎల్​లో సన్​రైజర్స్ అంటే బౌలింగ్​తో నెట్టుకొచ్చే జట్టు అని ఒకప్పుడు పేరుండేది. కానీ, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుతో చేరిన తర్వాత కథ మారింది. బ్యాటింగ్​లోనూ హైదరాబాద్ మార్క్ కనిపించింది. అయితే వార్నర్ దిల్లీ ఫ్రాంచైజీకి మారిన తర్వాత మళ్లీ పాత కథే అయ్యింది. గత రెండు సీజన్లలోనూ సన్​రైజర్స్ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇక తాజాగా ముంబయి మ్యాచ్​తో హైదరాబాద్​ ఫ్యాన్స్​లో ఒక్కసారిగా జోష్ వచ్చింది.

Sunrisers Hyderabad IPL: ఐపీఎల్ 17వ సీజన్ ముంబయి వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్​లో పరుగుల వర్షం కురిసింది. సన్​రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్, అభిషేక్, క్లాసెన్ ఉప్పల్​లో బీభత్సం సృష్టించారు. బంతి బౌలర్ చేతిలో కంటే బౌండరీలలోనే ఎక్కువగా కనిపిస్తుంటే ఇది సన్‌రైజర్స్ జట్టేనా? అన్న అనుమానం కూడా కలిగింది. ఎప్పుడూ బౌలింగ్​ మీదే ఆధారపడి విజయాలు నమోదు చేసే సన్​రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఏకంగా 277 పరుగులు నమోదు చేసి బెంగళూరు పేరిట ఉన్న రికార్డు (263-5)ను తుడిచేసింది.

అయితే అటువైపు ఉంది 5సార్లు ట్రోఫీని ముద్దాడిన ముంబయి జట్టు. ఇటేమో బౌలింగ్​లో పర్ఫెక్ట్​గా ఉన్నా, బ్యాటింగ్​లో కాస్త అటు ఇటూగా కనిపించే జట్టు. అదే అంచనాలతో టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకున్నాడు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. దీంతో మ్యాచ్ హైదరాబాద్ బౌలర్లు వర్సెస్ ముంబయి బ్యాటర్లకు మధ్యే ఉంటుందని అనుకున్నారు. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యాయి.

హైదరాబాద్ హీరోలు ట్రావిస్ హెడ్ (62 పరుగులు), అభిషేక్ శర్మ (68 పరుగులు), ఎయిడెన్ మర్​క్రమ్ (42 పరుగులు), హెన్రీచ్ క్లాసెన్ (80 పరుగులు) ముంబయి బౌలర్లపై దాడి చేశారు. దీంతో సన్​రైజర్స్ భారీ స్కోర్ సాధించగలిగింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ లేని సన్​రైజర్స్ బ్యాటింగ్​లో రాణించలేదు అన్నవారికి తాజా ఇన్నింగ్స్​తో ఈ స్టార్లు దీటైన సమాధానం చెప్పారు. ముఖ్యంగా సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్​లో రెచ్చిపోతున్నాడు. అతడు తొలి మ్యాచ్​లోనూ అసాధారణంగా పోరాడాడు. కేకేఆర్​పై 29 బంతుల్లోనే 63 పరుగులు సాధించాడు. అందులో ఏకంగా 8 సిక్స్​లు ఉన్నాయి. ఇక ముంబయిపై కూడా 235 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేశాడు.

ఇక మరో స్టార్ ట్రావిస్ హెడ్​ ఈ సీజన్​లో ఆడిన తొలి మ్యాచ్​లోనే తనలోని విధ్వంసక వీరుడిని పరిచయం చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే బౌండరీలు లక్ష్యంగా చేసుకొని స్కోర్ బోర్డును జెట్ స్పీడ్​తో పరిగెత్తించాడు. వన్​డౌన్​లో వచ్చిన అభిషేక్ సైతం గ్రౌండ్​ను షేక్ చేశాడు. కేవలం బౌండరీల తన లక్ష్యం అన్నట్లు మెరుపు వేగంతో ఆడాడు. మిడిలార్డర్​లో మాజీ కెప్టెన్ మర్​క్రమ్, క్లాసెన్ అదరగొడుతున్నారు. వీళ్లకు తోడు బౌలర్లు కూడా రాణించి, ఇదే జోరు ముందు ముందు మ్యాచ్​ల్లో కొనసాగిస్తే, సన్​రైజర్స్​ ఛాంపియన్​గా నిలవడం పక్కా అని హైదరాబాద్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఆ సెంటిమెంట్ కలిసొస్తే: అయితే హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇప్పటిదాకా ఐపీఎల్​లో రెండుసార్లు ఛాంపియన్​గా నిలిచింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ (అప్పటి పేరు), 2016లో సన్​రైజర్స్​ టైటిల్ నెగ్గింది. అయితే ఈ రెండూ కూడా ఆస్ట్రేలియన్ కెప్టెన్ల సారథ్యంలో వచ్చినవే. 2009లో ఆడమ్ గిల్​క్రిస్ట్ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గితే, 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో హైదరాబాద్ ఛాంపియన్​గా నిలిచింది. అయితే ఈసారి సన్​రైజర్స్​కు కెప్టెన్సీ వహిస్తున్న ప్యాట్ కమిన్స్​ కూడా అస్ట్రేలియా ప్లేయరే. దీంతో ఫ్యాన్స్ ఈసారి ఆస్ట్రేలియా ప్లేయర్ల సెంటిమెంట్ కలిసొస్తుందని భావిస్తున్నారు.

ఉప్పల్‌ ఊగిపోయింది - ముంబయిపై సన్​రైజర్స్​ అద్భుత విజయం - MI VS SRH IPL 2024

కావ్య పాప ఫుల్ ఖుషీ - ఈ భూమి మీద ఇంకెవరూ ఇంత అందంగా, ఆనందంగా ఉండరేమో! - IPL 2024 MI VS Sunrisers

Last Updated :Mar 28, 2024, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.