ETV Bharat / sports

IPL 2024 కొత్త జెర్సీ కొత్త కెప్టెన్​తో ఆరెంజ్ ఆర్మీ - సన్​రైజర్స్ బలాబలాలు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 8:25 AM IST

IPL 2024 Sunrisers Hyderabad : 2013లో ఐపీఎల్‌ అరంగేట్రం. 2016లో ఛాంపియన్‌. కానీ ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు భారీ అంచనాలతో బరిలోకి దిగడం చివరికి ఉసూరుమనిపించడం ఆ జట్టుకు అలవాటు అయిపోయింది. గత మూడు సీజన్లు నుంచి అయితే మరీ దారుణమైన ప్రదర్శన చేస్తోంది. అదే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రస్థానం. అయితే ఈ సారి కొత్త కెప్టెన్‌, కోచ్, జెర్సీలతో బరిలోకి దిగి మళ్లీ ఆశలను రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీ బలాబలాలపై ఓ లుక్కేద్దాం.

IPL 2024 కొత్త జెర్సీ కొత్త కెప్టెన్​తో ఆరెంజ్ ఆర్మీ - సన్​రైజర్స్ బలాబలాలు ఇవే!
IPL 2024 కొత్త జెర్సీ కొత్త కెప్టెన్​తో ఆరెంజ్ ఆర్మీ - సన్​రైజర్స్ బలాబలాలు ఇవే!

IPL 2024 Sunrisers Hyderabad : సన్‌రైజర్స్‌ హైదరాబాద్​ ఎప్పటిలాగే ఈసారి కూడా కోటీ ఆశలతో ఐపీఎల్ బరిలోకి దిగబోతుంది. సన్‌రైజర్స్‌కు క్రేజ్ పెంచిన వార్నర్‌, విలియమ్సన్‌ను పక్కనపెట్టి మరీ కొత్త కెప్టెన్ కమిన్స్​ సారథ్యంలో దిగనుంది ఆసీస్​ను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా, వన్డే ప్రపంచకప్‌ విజేతగా నిలిపిన కమిన్స్‌ను ఏకంగా రూ.20.5 కోట్లకు దక్కించుకుని అతడిపైనే ఆశలు పెట్టుకుందా జట్టు. అయితే గత మూడూ సీజన్లలో అత్యంత దారుణ ప్రదర్శనతో వరుసగా 10, 8, 10 స్థానాల్లో ఉండిపోయిన సన్​రైజర్స్​ ఈ సారైనా గెలవాలని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.మరి ఈ సారి విదేశీ ఆటగాళ్ల బలం, స్వదేశీ క్రికెటర్ల సత్తాతో రెడీ అయన ఈ ఆరెంజ్​ ఆర్మీ జట్టుకు కొత్త కెప్టెన్​ ఎలాంటి రిజల్ట్​ను అందిస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

బలాల విషయానికొస్తే ఫారెన్ ప్లేయర్స్​ సన్‌రైజర్స్‌కు కొండంత బలమనే చెప్పాలి. కెప్టెన్‌ కమిన్స్‌తో పాటు మార్‌క్రమ్‌, ట్రావిస్‌ హెడ్‌, క్లాసెన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, హసరంగ, యాన్సెన్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీ లాంటి విదేశీ ఆటగాళ్లు టీమ్​లో ఉన్నారు. కమిన్స్ అయితే ప్రస్తుతం ఫామ్​లో ఉన్నాడు. పేస్‌ బౌలింగ్‌తో, బ్యాటింగ్‌తో సత్తాచాటగలడు. అతడి కెప్టెన్సీపై ఎలాంటి సందేహాలు లేవు. హెడ్‌ కూడా విధ్వంసక ఆటగాడు. ఈ ఏడాది టీ20ల్లో అతని స్ట్రైక్‌రేట్‌ 152 పైనే ఉంది. మార్‌క్రమ్‌, క్లాసెన్‌, ఫిలిప్స్‌ కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌ రిజల్ట్​ను మార్చగలరు. పేసర్‌ యాన్సెన్‌, స్పిన్నర్‌ హసరంగ అయితే బాల్​తోపాటు బ్యాట్‌తోనూ అద్భుతంగా రాణించగలరు. టీమ్​లో భారత బౌలర్ల దళం కూడా బలంగా ఉంది. పేస్‌ త్రయం నటరాజన్‌, భువనేశ్వర్‌, ఉమ్రాన్‌ కాస్త నిలకడగా ప్రదర్శన చేస్తే జట్టుకు తిరుగుండదనే చెప్పాలి. వాషింగ్టన్‌ సుందర్‌ కూడా మంచి స్పిన్‌ ఆల్‌రౌండరే.

బలహీనతల విషయానికొస్తే జట్టులో ఉన్న భారత ప్లేయర్స్ ​అంతగా ఫామ్‌లో లేరు. వారి అనుభవలేమి కూడా జట్టుకు ఓ సమస్య. రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌, అబ్దుల్‌ సమద్‌, మయాంక్‌ అగర్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమ్రాన్‌ అంచనాలను అందుకోవాలి. జట్టులో సమష్టితత్వం లేదనిపిస్తోంది. వార్నర్‌, విలియమ్సన్‌, మార్‌క్రమ్‌ అంటూ వరుసగా కెప్టెన్లను మార్చడం కూడా జట్టుకు ఓ మైనస్ అనే చెప్పాలి. ప్రస్తుత కొత్త కెప్టెన్​ కమిన్స్​ ఇంటర్నేషనల్ క్రికెట్​ టెస్టుల్లో, వన్డేల్లో మంచిగా ప్రదర్శన చేస్తున్నా ప్రస్తుతానికి టీ20ల్లో అనుకున్నంత స్థాయిలో ఫామ్​లో లేడు. చూడాలి మరి అంచనాల ఒత్తిడిని కమిన్స్‌ ఎలా అధిగమిస్తాడో

దేశీయ ఆటగాళ్లు : రాహుల్‌ త్రిపాఠి, అబ్దుల్‌ సమద్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, మయాంక్‌ అగర్వాల్‌, నితీశ్‌ కుమార్‌, ఉపేంద్ర సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ, జాతవేద్‌ సుబ్రహ్మణ్యన్‌, సన్వీర్‌ సింగ్‌, షాబాజ్‌ అహ్మద్‌, ఆకాశ్‌ సింగ్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌, మయాంక్‌ మార్కండే.

విదేశీయులు : కమిన్స్‌ (కెప్టెన్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్‌క్రమ్‌, ట్రావిస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, హసరంగ, మార్కో యాన్సెన్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ;

IPL 2024 గెట్‌ రెడీ ఆరెంజ్‌ ఆర్మీ - హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే?

IPL 2024 గుజరాత్‌ మళ్లీ మెరుస్తుందా? అతడిపైనే ఆశలన్నీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.