ETV Bharat / spiritual

నాగదోషంతో రకరకాల సమస్యలా? ఆ గుడిలో మంగళవారం అలా పూజ చేస్తే చాలు! - Subramanya Swamy Temple Mopidevi

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 4:46 AM IST

Mopidevi Temple Significance : దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఒక ఆలయంలో సంతానం లేని దంపతులు ఒక రాత్రి నిద్రిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం. మరి ఇంతటి మహిమాన్విత క్షేత్రం ఎక్కడ ఉంది? ఆ క్షేత్ర విశేషాలేమిటో తెలుసుకుందాం.

Mopidevi Temple
Mopidevi Temple (ETV Bharat)

Mopidevi Temple Significance : హిందూ పురాణాల ప్రకారం కుజ గ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకే వివాహం ఆలస్యం అయ్యేవారు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే దోషాలు పోతాయి.
కృష్ణానదీ తీరంలో వెలసిన మహిమాన్విత క్షేత్రం
కృష్ణానదీ తీరంలో వెలసిన మోపిదేవి పుణ్యక్షేత్రం ఒక్కసారి దర్శిస్తే వివాహం ఆలస్యం అయ్యేవారికి వారికి వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్రిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం.

ఆలయ చరిత్ర
Mopidevi Subramanya Swamy Temple History In Telugu : పూర్వం వింధ్య పర్వతం గర్వాధికత్యంతో ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్య గమనాన్ని సైతం నిలువరించసాగింది. దీనితో ప్రకృతి లయ తప్పింది. గ్రహాల గమనం స్తంభించిపోయింది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు వింధ్య పర్వత గర్వాన్ని అణచాల్సిందిగా అగస్త్య మహామునిని వేడుకున్నారంట! కాశీ పుణ్యక్షేత్రంలో స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉన్న అగస్త్యుడు వింధ్య పర్వతం గర్వం అణచాలంటే తిరిగి మళ్లీ కాశీకి రాలేనని తెలిసికూడా లోక క్షేమం కోసం అందుకు ఒప్పుకుంటాడు.

వింధ్య పర్వత గర్వమణచిన అగస్త్యుడు
అగస్త్య మహాముని లోపాముద్రతో కలిసి దక్షిణ దేశానికి బయలుదేరుతాడు. అగస్త్య మహాముని రాకను గమనించి వింధ్యపర్వతం మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు అగస్త్యుడు నేను తిరిగి వచ్చేంతవరకు అలానే ఉండమని వింధ్య పర్వతాన్ని శాసిస్తాడు.

మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి
మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి (ETV Bharat)

అగస్త్యుని పాదస్పర్శతో దక్షిణదిశ పావనం
కాశీ విశ్వనాధుని, విశాలాక్షిని మనసులో స్మరించుకుంటూ అగస్త్యుడు లోపాముద్ర, శిష్యగణం దక్షిణ దిశగా ప్రయాణం సాగించారు. పవిత్ర గోదావరి తీరాన్ని పావనం చేసి, కృష్ణా తీరం చేరుకున్న అగస్త్య మహర్షి నోటి వెంట అనుకోకుండా ఓ శ్లోకం వస్తుంది. "వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్‌" "సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్‌"

పుట్టలో సుబ్రహ్మణ్యుని కనుగొన్న అగస్త్యుడు
Mopidevi Temple Wikipedia : కృష్ణా తీరంలో వారు సంచరిస్తున్న ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంటుంది. అందులో ఒక పుట్ట నుంచి దివ్య తేజస్సు రావడం గమనించి ఇదే సుబ్రహ్మణ్యుని క్షేత్రమని అగస్త్యుడు తన శిష్యులతో చెబుతాడు. దివ్య తేజస్సు వస్తున్న పుట్టలో సుబ్రహ్మణ్యుడు ఉరగ రూపంలో తపస్సు చేయడానికి గల కారణాలను అగస్త్యుడు శిష్యులకు వివరిస్తాడు.

కైలాసంలో నాంది
ఒకసారి పరమశివుని దర్శనం కోసం అగస్త్య, సనత్కుమార, సనత్సు దేవర్షులు మొదలైన వారు కైలాసం చేరుకున్నారు. వీరందరూ కూడా ఎప్పుడు ఐదేళ్ల ప్రాయం కలవారిగా దిగంబరధారులై, ఎప్పుడూ భగవదారాధనలో దేహ చింతన లేకుండా ఉంటారు. అదే సమయంలో లక్ష్మీ, సరస్వతి, శచీ, స్వాహాదేవితోపాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆ సమయంలో కైలాసంలో శివుడు ఉండడు. పార్వతి దేవి, కుమారస్వామి మాత్రమే ఉంటారు.

కుమారస్వామి పరిహాసం
ఒకవైపు జడధారులు, మరోవైపు సుందరీమణులు చుసిన సుబ్రహ్మణ్యుని నవ్వాగలేదు. అప్పుడు పార్వతి దేవి "కుమారా! నీ పరిహాసానికి కారణమేమిటి? ఈ జడధారులు నీ తండ్రిలా లేరా? ఆ దేవతా స్త్రీలు నా వలే లేరా? అని అడిగిందట. అప్పుడు కుమారస్వామి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది పార్వతి దేవి వారిస్తున్నా వినకుండా తపస్సు చేసుకోవడానికి భూలోకానికి వచ్చి కృష్ణా తీరంలో సర్ప రూపంలో పుట్టలో ఉండి తపస్సు ప్రారంభించాడు.

అగస్త్య ప్రతిష్ఠిత శివలింగం
సుబ్రహ్మణ్యుడు సర్ప రూపంలో తపస్సు చేస్తున్నది ఈ ప్రాంతమే అని అగస్త్యుడు తన శిష్యులకు చెబుతాడు. అనంతరం అగస్త్యుడు దివ్యతేజస్సు వెలువడే ఆ పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.

కుమ్మరి నిర్మిత ఆలయం
కొన్ని రోజుల తర్వాత వీరారపు పర్వతాలు అనే పరమ శివభక్తునికి స్వప్నంలో శివుడు సాక్షాత్కరించి తనకు ఆలయం నిర్మించమని కోరుతాడు. ఆ భక్తుడు శివునికి ఆలయం నిర్మించి శివునికి ఇష్టమైన వస్తువులు మట్టితో తయారుచేసి ఆలయంలో భద్రపరచేవాడంట.

మోహినీపురమే మోపిదేవి!
తొలుత మోహినీపురంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా మోపిదేవిగా మారింది. మోపిదేవి ఆలయంలో పాముచుట్టలపైనే శివలింగం ఉంటుంది. పానవట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయాల్లో పాలు పోస్తారు.

మోపిదేవి సుబ్రహ్మణ్యుని మహత్యం
మోపిదేవి సుబ్రహ్మణ్యుని ఆలయంలో అభిషేకం, అర్చన పూజలు జరిపించుకుంటే దృష్టిలోపం, వినికిడి లోపం, శారీరక దౌర్భల్యం, చర్మసంబంధ వ్యాధులతో బాధపడేవారు వారివారి బాధల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు విద్య, ఐశ్వర్యాభివృద్ధి కూడా కలుగుతుంది.

నాగదోష పరిహారం
మోపిదేవి క్షేత్రంలో ముఖ్య విశేషమేమిటంటే ఈ ఆలయంలో నాగదోష పరిహార పూజలు జరిపించుకుంటే వివాహం ఆలస్యమయ్యేవారికి శ్రీఘ్రంగా వివాహం అవుతుంది. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. నాగదోషంతో రకరకాల సమస్యలు ఉన్నవారు నమ్మకం, విశ్వాసంతో మోపిదేవి ఆలయంలో పూజలు జరిపించుకుంటే దోషపరిహారం అవుతుంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మీ జాతకంలో చంద్రదోషం ఉందా? 11 సోమవారాలు ఇలా చేస్తే అంతా క్లియర్! - Chandra Dosha Pariharam

శంకరాచార్యులు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే! 'ఆదిగురువు' గురించి ఈ విషయాలు తెలుసా? - ADI SHANKARACHARYA JAYANTI SPECIAL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.