ఫారిన్​ టూర్​కు ప్లాన్​ వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! - Successful Foreign Trip

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 6:11 PM IST

Tips For Successful Foreign Trip

Tips For Successful Foreign Trip : ఫారిన్​ వెకేషన్​ కోసం ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఈ విషయంలో మీరు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే మీ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీ ట్రిప్​ను సాఫీగా కొనసాగించగలరు. ఈ నేపథ్యంలో విదేశీ వెకేషన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips For Successful Foreign Trip : ప్రయాణం-ఎల్లప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది. అదే విదేశీ ప్రయాణం అయితే చెప్పక్కర్లేదు. రెట్టింపు ఆనందాన్ని అందిచడమే కాకుండా మధుర జ్ఞాపకాలను మిగుల్చుతుంది.

International Travel Safety Guide : ఫారిన్​ ట్రిప్​​ అనేది మర్చిపోలేని అనుభవం. అయినప్పటికీ దేశం బయట ప్రయాణించే సమయంలో ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు ఇతర సంక్షోభాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళిక అనేది చాలా అవసరం. పర్యటన సమయంలో బయలుదేరినప్పటి నుంచి ఇంటికి తిరిగి వచ్చేవరకు కొన్నిసార్లు అనేక సవాళ్లు మనకు ప్రయాణంలో ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఈ అడ్డంకులను ఎదుర్కొని సాఫీగా సాగే విదేశీ పర్యటన కోసం కొన్ని చిట్కాలను మీ ముందుకు తెచ్చాం.

బడ్జెట్​ సెటప్​!
మెరుగైన వాతావరణం, సాంస్కృతిక ఆకర్షణలు సహా వివిధ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకునే ప్రయాణికులకు యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు బెస్ట్​ ఆప్షన్లు. విదేశాలకు వెళ్లేటప్పుడు ముఖ్యమైన విషయాల్లో మీ ఆసక్తి ఆధారంగా మీరు సందర్శించబోయే ప్రదేశాలను ముందే ఎంపిక చేసుకొని ఉంచుకోవాలి. ఇది మీకు బడ్జెట్‌ను సమకూర్చుకోవడంలో ఎంతగానో దోహదపడుతుంది. విమానాలు, వసతి, భోజనం, కార్యకలాపాలు, ప్రయాణ బీమా, వీసా లాంటి ఖర్చులను కవర్‌చేసే వివరణాత్మక బడ్జెట్‌ను రూపొందించుకునేందుకు ఈ ముందస్తు ప్రణాళిక ఉపయోగపడుతుంది.

ఖర్చుల విషయంలో జాగ్రత్త!
విదేశాలకు వెళ్లే సమయాల్లో ఎక్కువ శాతం ఖర్చు అంతర్జాతీయ విమానాల టికెట్లకు అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం విశ్వసనీయ ట్రావెల్‌ వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించండి. వాటిల్లోనే మీకు కావాల్సిన విమానాల గురించి వెతకండి. లేదా ఆకర్షణీయమైన డీల్స్‌ కోసం ట్రావెల్‌ ఏజెంట్స్‌ను సంప్రదించండి.

కొన్ని ప్రయాణ తేదీల్లో విమాన ప్రయాణాల ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని బెస్ట్​ ఆప్షన్​ను పొందేందుకు మీకు అనువుగా ఉండే తేదీలను ఎంచుకోండి. విమాన ప్రయాణ టికెట్లను ముందుగానే బుక్‌ చేసుకుంటే తక్కువ ధరలో లభించే అవకాశం ఉంది. చివరి నిమిషంలో బుకింగ్‌ మీకు ఖర్చుతో కూడుకున్నదే కాకుండా టికెట్ల లభ్యత అనేది సమస్యగా మారవచ్చు. అయితే మీరు కనెక్టింగ్‌ విమానాలను బుక్‌ చేస్తుంటే, లేఓవర్‌ సమయాన్ని తనిఖీ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీంతో పాటు వివిధ విమానయాన సంస్థల ధరలను కంపేర్​ చేయండి.

ఆ క్రెడిట్​ కార్డులనే వాడండి!
మీ ప్రయాణ ఖర్చును తగ్గించడంలో క్రెడిట్‌ కార్డులు బాగా సహాయపడతాయి. విదేశీ లావాదేవీల రుసుములు, అనుకూలమైన కరెన్సీ మార్పిడి రేట్లు లేదా ప్రయాణ రివార్డులు లాంటి అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సాహకాలను అందించే క్రెడిట్‌ కార్డుల కోసం ప్రయత్నించండి. మీ ఖర్చుల కోసం రివార్డు క్రెడిట్‌ కార్డును ఉపయోగించండి. విమానాలు, హోటల్‌లో వసతి లేదా ఇతర ప్రయాణ సంబంధిత ఖర్చుల కోసం రిడీం చేయగల పాయింట్లు లేదా మైల్స్‌ను సేకరించండి. వీటివల్ల మీ మొత్తం ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

డాక్యుమెంట్స్​ బ్యాకప్​!
హోటల్స్‌, హాస్టల్స్‌, సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌ లాంటి వాటిల్లో బస చేసేందుకు వసతి ఎంపికలను అన్వేషించండి. ముందస్తుగా బుకింగ్‌ చేసుకుంటే వసతి తక్కువ ధరకే లభిస్తుంది. ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా వసతిని చూసుకోండి.

పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులు, ప్రయాణ రిజర్వేషన్స్‌, ప్రయాణ బీమా లాంటి ముఖ్యమైన పత్రాలను స్కాన్‌ చేసి లేదా ఫోటోలు తీసి పెట్టుకోండి. ఈ డిజిటల్‌ కాపీలను సురక్షిత క్లౌడ్‌లో భద్రపర్చండి. ఒకవేళ ఫిజికల్‌ డాక్యుమెంట్స్‌ కాపీలు పోయినా లేదా చోరీకి గురయినా సులభంగా వీటిని యాక్సెస్‌ చేసుకునే ఛాన్స్​ ఉంటుంది.

మీ విలువైన వస్తువులను భద్రంగా ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉండేలా చూసుకోండి. మీ వీసా, పాస్‌పోర్ట్‌, బ్యాంకు కార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను మీ వెంటే తీసుకెళ్లండి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులను ప్రదర్శించకుండా ఉంటే మంచిది. మీరు విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా పాస్‌పోర్ట్‌ను తరచూ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఇది అత్యంత విలువైన, ముఖ్యమైన పత్రం.

ఆరోగ్యంపై దృష్టి!
మీరు బయలుదేరే ముందు మీ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వండి. ప్రయాణాలు చేసే ముందు టీకాలు, మందులు ఎంత వరకు అవసరమో మీ వ్యక్తిగత వైద్యుడిని అడిగి తెలుసుకోండి. మీకు రెగ్యులర్‌గా ఉండే అనారోగ్యాలకు సంబంధించి అవసరమైన మందులను వెంట తీసుకెళ్లండి. ప్రాథమిక ఆరోగ్య చికిత్స కిట్​ను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. దీనికి తోడు మీరు గ్లోబల్‌ హెల్త్‌ కవరేజ్‌ లేదా విదేశీ వైద్య చికిత్సను కవర్‌ చేసే ప్రయాణ బీమాను కలిగి ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే విదేశాల్లో చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా అక్కడ విధించే ఛార్జీలను మీరు భరించలేకపోవచ్చు. అవి మీ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరోవైపు మీ ప్రయాణానికి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీ సన్నిహితులతో పంచుకోండి. అంతర్జాతీయ సిమ్‌ కార్డులు లేదా డేటా రోమింగ్‌ ప్యాకేజీల ద్వారా వారితో నిత్యం కనెక్టడ్​గా ఉండండి.

ప్రయాణ బీమా!
ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు అనుకోకుండా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రయాణ బీమా తీసుకోవడం చాలా అవసరం. మెడికల్‌ ఎమర్జెన్సీలు, ప్రయాణ ట్రిప్‌ క్యాన్సిలేషన్స్‌ లేదా లగేజీ పోగొట్టుకోవడం లాంటి ఊహించని సంఘటనల నుంచి రక్షణ పొందడానికి ఏకైక మార్గం ప్రయాణ బీమా ప్లాన్‌ను కలిగి ఉండటం. మీ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నా లేదా మీ లగేజీ ఆలస్యంగా వచ్చినప్పుడు లేదా పోయినప్పుడు, మీరు ప్రమాదానికి గురయినా, అనారోగ్యం బారిన పడ్డా ఖర్చులను కవర్‌ చేయడంలో ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా విదేశాల్లో మీరు నగదును పోగొట్టుకుంటే కూడా ప్రయాణ బీమా మీకు అత్యవసర నగదు సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్రయాణ బీమా సంస్థలు తమ క్లయింట్లకు 24/7 అత్యవసర సేవలను అందిస్తుంటాయి.

కరెన్సీ ఎక్స్ఛేంజ్‌!
ఫారిన్​ టూర్​కు ప్లాన్​ చేస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇది ఒకటి, ముఖ్యమైంది కరెన్సీ. మీరు వెళ్లాలనుకుంటున్న దేశం ఏ కరెన్సీని ఉపయోగిస్తుందో ముందే తెలుసుకోండి. ఆ దేశంలో మన దేశ కరెన్సీ విలువ ఎక్కువ ఉందా? లేదా తక్కువ ఉందా? అనే దానిని తెలుసుకోవడానికి మీరు కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ రేటును చెక్​ చేయాలి.

ఇవీ తప్పక చేయండి!
మీ దగ్గర ఉన్న కరెన్సీతో విదేశాల్లో అవసరమయ్యే కరెన్సీని మార్చుకోండి. మెరుగైన రేట్ల కోసం ఫారెక్స్‌ కార్డులను ఉపయోగించండి. విదేశాల్లో ఉన్నప్పుడు ఊహించని కార్డు సమస్యలను నివారించడానికి మీ ప్రయాణ ప్రణాళికల గురించి మీ బ్యాంకుకు ముందే సమాచారమివ్వండి. ఎందుకంటే స్వదేశంలో ఉన్న బ్యాంకులు విదేశాల నుంచి లావాదేవీలను గమనించినట్లయితే ఆయా బ్యాంకులు మీ కార్డును ఫ్రీజ్​ చేసే అవకాశం ఉంటుంది. ఇక నగదు, కార్డులతో పోలిస్తే ట్రావెలర్స్‌ చెక్‌ అత్యంత సురక్షితమైన లావాదేవీ విధానం. ప్రయాణంలో ట్రావెలర్‌ చెక్స్‌ను, ట్రావెల్‌ మనీ కార్డులను, తక్కువ లిక్విడ్​ క్యాష్​ను మాత్రమే వెంట ఉంచుకునేందుకు ప్రయత్నించండి.

ఫాస్టాగ్​ యూజర్లకు అలర్ట్​ - కేవైసీ అప్​డేట్​కు మరో 4 రోజులే ఛాన్స్! - fastag kyc update

మీరు ఆటోమేటెడ్ కారు వాడుతున్నారా? - ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు! - AMT Car Safety Driving Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.