ఎన్నికలొస్తున్నాయ్, మీవద్ద 'e-EPIC కార్డు' ఉందా? ఈజీగా డౌన్లోడ్​ చేసుకోండిలా! - How To Download e EPIC Card

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 1:48 PM IST

How To Download e-EPIC Card

How To Download e-EPIC Card : ఎన్నికల సమయం సమీపిస్తోంది. 'ఈ-ఎపిక్ కార్డు'ను డౌన్లోడ్​ చేసుకున్నారా? ఓటు అనే వజ్రాయుధానికి డిజిటల్ అవతారమిది. ఫోన్ నంబర్​ను లింక్ చేయడం ద్వారా మన ఓటరు ఐడీకి మరింత సెక్యూరిటీని పెంచే అధునాతన ఫీచర్ 'ఈ-ఎపిక్ కార్డు'. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివే.

How To Download e-EPIC Card : ఓట్ల పండుగకు సమయం సమీపిస్తోంది. వజ్రాయుధం లాంటి ఓటుతో దాదాపు 97 కోట్ల మంది భారత ప్రజానీకం తీర్పునిచ్చే కీలక ఘడియలు ఎంతో దూరంలో లేవు. ఈ తరుణంలో ప్రతీ ఓటరు బాధ్యతగా తమ ఓటుకు సంబంధించిన అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది. ప్రత్యేకించి ఓటరు గుర్తింపు కార్డును ప్రింట్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. దీంతోపాటు అందరూ తప్పకుండా ఈ-ఎపిక్ కార్డును (e-EPIC Card) కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. మరేం లేదు ఇది మన ఓటరు ఐడీ కార్డుకు డిజిటల్ వర్షన్. దీనికి సంబంధించిన సమస్త సమాచారాన్ని మీరు ఈ కథనంలో పొందొచ్చు.

e-EPIC కార్డు అంటే ఏమిటి?
ఈ-ఎపిక్ కార్డు (e-EPIC Card) అనేది మన ఓటరు గుర్తింపు కార్డుకు పీడీఎఫ్ వర్షన్. అయితే ఇందులో ప్రత్యేకమైన నంబర్ ఒకటి ఉంటుంది. దాన్నే EPIC నంబర్ అంటారు. ఈ-ఎపిక్ కార్డు పీడీఎఫ్‌ను డౌన్లోడ్​ చేసుకొని మన మొబైల్‌ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డు పీడీఎఫ్‌ను డిజి లాకర్‌ అకౌంటులోనూ అప్‌లోడ్ చేసి స్టోర్ చేయొచ్చు. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు దాన్ని ప్రింట్ తీసి లామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది.

e-EPIC నంబర్ మీకు లేదా?
ఓటరు గుర్తింపు కార్డుకు ఫోన్ నంబర్ లేదా మెయిల్ ఐడీని లింక్ చేసుకున్న వారంతా e-EPIC కార్డును వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవి లింక్ అయి లేకుంటే https://voters.eci.gov.in/signup అనే వెబ్ లింక్‌‌ను ఫాలో అయి ఆ ప్రాసెస్‌ను పూర్తి చేయొచ్చు. ఈక్రమంలో మీరు సమర్పించే ఫోన్ నంబరు లేదా మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేశాక అప్రూవల్ లభించి మీ ఓటరు ఐడీపై EPIC నంబర్ జారీ అవుతుంది.

e-EPIC డౌన్లోడ్ ఎలా?

  • మీరు ఈ-ఎపిక్ కార్డును http://voterportal.eci.gov.in/ లేదా https://nvsp.in/ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ పోర్టల్‌లలో ఏదో ఒకదానిలోకి వెళ్లాక తొలుత నమోదు/లాగిన్ చేయాలి.
  • అనంతరం మెనూ నావిగేషన్ నుంచి డౌన్‌లోడ్ e-EPIC అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • వెంటనే తెరుచుకున్న పేజీలో ఎపిక్ నంబర్ లేదా మీ ఫోన్ నంబరును నమోదు చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని పోర్టల్‌లో నమోదు చేసి ధ్రువీకరణ పొందాలి.
  • దీంతో మీ మొబైల్ నంబర్ ఆధారంగా ఈ-ఎపిక్ కార్డు జారీ అవుతుంది.
  • చివర్లో డౌన్‌లోడ్ e-EPIC అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దాన్ని క్లిక్ చేసి ఈ- ఎపిక్ కార్డు పీడీఎఫ్ వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి.
  • ఒకవేళ మీ ఫోన్ నంబర్ నమోదు కాకపోతే KYCని పూర్తి చేయడానికి e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఫేస్ లైవ్‌నెస్ వెరిఫికేషన్‌లో మీరు పాస్ కావాల్సి ఉంటుంది.
  • KYCని పూర్తి చేయడానికిగానూ మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి.
  • ఆ తర్వాత మీరు e-EPICని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

e-EPICని పోగొట్టుకుంటే ఎలా?
ఒకవేళ మీరు మీ ఈ-ఎపిక్ కార్డును పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. http://voterportal.eci.gov.in/ లేదా http://electoralsearch.in/ పోర్టల్‌లోకి వెళ్లి ఎలక్టోరల్ రోల్‌లో మీ పేరును సెర్చ్ చేయండి. అక్కడే మీ పేరుతో పాటు ఎపిక్ నంబర్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఈ-ఎపిక్ కార్డును వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

e-EPIC కార్డుతో ప్రయోజనం ఏమిటి?
డిజిటల్ ఫార్మాట్‌లో ఓటర్లు తమ గుర్తింపు సమాచారాన్ని భద్రపర్చుకునే అత్యుత్తమ ప్రత్యామ్నాయం ఈ-ఎపిక్ కార్డు. దీని పీడీఎఫ్ ఫోన్​లో ఉంటే ఓటరు గుర్తింపు కార్డు ప్రింట్‌ను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మన ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వంటి వివరాలు కూడా ఓటరు ఐడీతో అటాచ్ కావడానికి దోహదం చేస్తున్న అత్యుత్తమ మార్గం ఈ-ఎపిక్ కార్డు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.